తుంగతుర్తి: లింగంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య హత్యకు గురయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంతో ఇవాళ మరో హత్య జరిగిందని, తాను ఆ రోజే పోలీసులకు చెప్పానని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతికకాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి దైర్యం చెప్పారు. అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ గడ్డపై గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి ఉందని, తాము పదేళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశామన్నారు. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ హత్యలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బిఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకులు దారుణంగా హతమార్చారని దుయ్యబట్టారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దాడి చేయడంతో బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారని ఆరోపణలు చేశారు. 15 మంది బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పినా పోలీసులు పెడచెవిన పెట్టారని బిఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే బిఆర్ఎస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడని, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి కెటిఆర్ వస్తానన్నారు కానీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వేళ పరిస్థితులు ఉద్రిక్తం అవ్వకూడదని తాము తర్వాత పరమర్శించాలని కోరామన్నారు.