అడ్డుకుంటే మా వద్దకు రండి.. లేకపోతే అరాచకం అవుతుంది
బిఎల్‌ఓల సమస్యలు మా దృష్టికి తీసుకురండి
అవసరమైతే ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సర్ ప్రక్రియలో భాగమైన బూత్‌లెవెల్ అధికారులు (బిఎల్‌ఒ), ఇతర అధికారులు పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతుండడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆదేశించింది. లేకపోతే అరాచకం అవుతుందని హెచ్చరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్‌ఓలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. బీఎల్‌ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే స్తానిక పోలీసులను డిప్యుటేషన్ పై తీసుకోవలసి వస్తుందని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కేంద్ర బలగాలను రప్పించ వలసి వస్తుందని ఎన్నికల సంఘం తరపున కోర్టుకు హాజరైన ద్వివేది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ సనాతని సంగ్సాద్ , ఇతరుల తరఫున సీనియర్ న్యాయవాది వి. గిరి హాజరయ్యారు. బిఎల్‌ఒలపై దాడులు , బెదిరింపులు జరగకుండా వారికి రక్షణ కల్పించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.