1,650 ఇండిగో విమానాల రాకపోకలు క్రమంగా కుదుటపడుతున్న ప్రయాణాలు
విమానాలు రద్దయిన ప్రయాణికులకు రూ.610 కోట్ల రిఫండ్
శంషాబాద్‌లో కొనసాగిన సంక్షోభం, 126 సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్ంతగా ఇండిగో విమానాల ప్రయాణాలు క్రమేపీ కుదుటపడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దుతున్నామని సంస్థ సిఇఒ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. దశలవారీగా మేం తిరిగి సవ్యమైన పరిస్థితికి చేరుకుంటున్నామని ఆయన ఆదివారం తెలిపారు. దేశంలో అత్యధిక విమానాల నిర్వహణ సంస్థ ఇండిగో ద్వారా ప్రతిరోజూ సాధారణంగా 2,300 విమానాలు నిర్వహిస్తారు. అయితే కొద్దిరోజులుగా పలు విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాల నిలిపివేతతో ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. తాము పెద్ద ఎత్తున చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఆదివారం సాయంత్రానికి దాదాపు 1,650 విమానాలను నడిపించినట్లు సిఒఒ తెలిపారు. ఆయన సిబ్బందికి అంతర్గత సందేశం లో ఈ విషయం తెలిపారు.
ఆదివారం నిర్వహణ సామర్థం (ఒటిపి)75 శాతానికి చేరుకుందని వివరించారు. ఆదివారం మొత్తం 138 రూట్లలో 137 వరకూ సజావుగా ప్రయాణాలు సాగాయని వివరించారు. ఇక పరిస్థితిని బట్టి ముందుగా కొన్ని విమానాల కాన్సిల్ గురించి సకాలంలో తెలియచేయడం జరుగుతుంది. దీని వల్ల విమానాశ్రయాలలో రద్దీ , ప్రయాణికుల పడిగాపులు ఉండకుండా ఏర్పాట్లు జరిగాయి.ఇప్పటివరకూ ఇండిగో విమాన జాప్యం, రద్దు పరిణామాలతో ప్రయాణికులకు రిఫండ్ వేగవంతం అయింది. ఇప్పటివరకూ మొత్తం మీద రూ 610 కోట్ల వరకూ చెల్లింపులు జరిగాయి. ఇక 3వేల వరకూ బ్యాగేజ్‌లను దేశవ్యాప్తంగా ప్రయాణికుల చిరునామాలకు పంపించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. టికెట్ల రిఫండ్ వేగవంతానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది.
శంషాబాద్‌లో కొనసాగిన సంక్షోభం.. 126 సర్వీసుల రద్దు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో ఇండిగో విమానాల రద్దు పరంపర ఆదివారం కొనసాగింది. ఆదివారం ఏకంగా 126 సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆదివారం రద్దయిన విమానాల్లో 66 శంషాబాద్ నుండి వెళ్లేవి కాగా, 60 రావాల్సిన విమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు రద్దు చేసిన మొత్తం ఇండిగో విమానాల సంఖ్య 519కి చేరుకుంది. సర్వీసుల రద్దు క్రమంగా తగ్గుతాయని ఇండిగో పేర్కొన్నప్పటికీ, త్వరలో ప్రయాణ ప్రణాళికలు ఉన్న ప్రయాణికులు తమ విమానాలు నడుస్తాయో లేదో అని ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇండిగో కౌంటర్ల వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సె క్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో పది ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. తమ వ్యవస్థను పునరుద్దరించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.