హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లలో రేవంత్ ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ ప్రారంభించిన స్కీములన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది? అని అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోడ్లు, స్కూళ్లు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని మండిపడ్డారు. ప్రజా భవన్‌ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని, పొద్దున్నేబ్రేక్‌ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్‌మెంట్లు.. సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్‌మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయని హరీశ్ రావు తెలియజేశారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడని, అతని ఫోన్‌కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది.. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదని అన్నారు. ఐటిఐ, ఐటి, ఐఐటికి తేడా తెలియని సిఎం మనకు దొరికారని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారని.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. పిల్లలు పుట్టాక కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద రూ.980 కోట్లు బకాయి పడిందని అన్నారు. రుణమాఫీ పూర్తిగా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. అందాల పోటీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారని, పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లండ్ వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగాయని హరీశ్ రావు ధ్వజమెత్తారు.