నేడు, రేపు గ్లోబల్ సమ్మిట్
భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబు
నేడు మధ్యాహ్నం సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
2:30 గంటలకు సిఎం రేవంత్‌తో పాటు ఆర్థిక, పారిశ్రామికవేత్తల ప్రసంగాలు
సదస్సుకు 154మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 2వేల మంది అతిథులు, ప్రముఖులు
వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు
3లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్షం
ఇప్పటికే 50 కంపెనీల సంసిద్ధత
విజన్2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న ప్రభుత్వం
10వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, సిసిటివిల నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రై జింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించ టం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యం గా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సి ద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూ చర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం ఒ కటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనం గా సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సా.6 గంటలకు సమ్మిట్ ముగియనుంది. సుమారు రెండువేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారం భ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్‌లో వివి ధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్ర్కైడర్, వరల్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యా లు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెష న్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వంద ఎకరాల్లో ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, మొత్తం 500 ఎకరా ల భూమిని ఈ సమ్మిట్ కోసం వినియోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సమ్మిట్ ప్రారం భం కానుండగా ఆదివారం మంత్రులు, అధికారులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాల్లో రిహార్సల్‌ను నిర్వహించారు.
అతిథులు హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, పలు దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండిలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతుండడంతో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు నిర్వహణ కోసం 20 రోజు ల నుంచి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాను న్న 22 ఏళ్లలో రాష్ట్రంలో ఏం సాధిస్తామన్న విషయాన్ని తెలియచేయడమే ఈ సమ్మిట్ ఉద్ధేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500ల నుంచి -600 మంది విఐపిలతో పాటు 1,500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో మొత్తం నాలుగు వేదికలపై చర్చలు జరుగనుండగా, రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
50 కంపెనీలు, రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 14 కంపెనీలకు ప్రభుత్వం తరపున లక్ష కోట్ల పెట్టుబడులపై అవగాహన కల్పించగా, తా జాగా మరో 36 సంస్థలతో అధికారులు పెట్టుబడులకు సం బంధించి జరిపిన చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ సమ్మిట్‌లో మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమ్మిట్‌ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్, అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్షంతో సమ్మిట్‌ను ఏర్పాటుచేశారు.
వంతారాకు 200 ఎకరాలు.. సెంబ్‌కార్ప్‌కు 1,000 ఎకరాలు
రిలయన్స్ సంస్థకు చెందిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 200ఎకరాలను ఫోర్త్ సిటీలోని ముచ్చర్లలో కేటాయించనున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తే వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, అనుబంద ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. మరోవైపు సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ సంస్థ తమకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ వెయ్యి ఎకరాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటామని ప్రతిపాదించింది. వియత్నాంకు చెందిన విన్‌గ్రూప్ కూడా తామే ఒక సమీకృత పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసి అందులో తమ కంపెనీతో పాటు ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలను కూడా తీసుకొస్తామని చెప్పింది.
ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్
ప్రతి చోటా డిజిటల్ స్క్రీన్లు, అందమైన లాన్లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేయడంతో పాటు టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా ఇరు వైపులా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రారంభ వేదికపై 2వేల మందికి పైగా ప్రతినిధులు కూర్చునే లా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన అధికారులు 22 ప్రభు త్వ శాఖల స్టాళ్లు, ప్రైవేటు సంస్థల స్టాళ్లను కూడా ఏర్పా టు చేశారు. 8,9వ తేదీల్లో సమ్మిట్ జరుగనుండగా 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్‌ను వీక్షించడానికి అనుమతిస్తారు.
కంట్రోల్ రూంతో సిసి కెమెరాల అనుసంధానం
సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రతినిధుల కోసం పోలీసుశాఖ ప్ర త్యేక దృష్టి సారించింది. ఈ ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథిగృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. కేవలం ఫ్యూచర్ సిటీలోనే వె య్యికి పైగా సిసి కెమెరాలను కంట్రోల్ రూంతో అనుసంధా నం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీసు అధికారులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. భద్రతా విధుల్లో 10వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు. వారికి అదనంగా మరో వెయ్యి మం ది ట్రాఫిక్ పోలీసులు పనిచేయనున్నారు. ట్రాఫిక్ మార్షల్స్‌తో పాటు గ్రేహౌండ్స్, క్విక్ రెస్పాన్స్ టీం, తెలంగాణ ప్రత్యేక పోలీ సు బలగాలు మూడో భద్రతా వలయంలో ఉండనున్నారు.
ప్రచార సామాగ్రి సిద్ధం
వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాం స్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.