చలికి వణుకుతున్న రాష్ట్రం
సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో చలి పులి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయని, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు.
చలి ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామన అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమరంభీం ఆసిఫాబాద్‌లో 9.1, నిర్మల్ 10.5, రాజన్న సిరిసిల్ల 10.9, జగిత్యాల, సంగారెడ్డి 11.1, కామారెడ్డి 11.2, నిజామాబాద్, సిద్దిపేట 11.3, మంచిర్యాల 11.4, మెదక్ 11.5, వికారాబాద్, పెద్దపల్లి 11.8, ములుగు 12 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.