మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్‌లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో 4,332 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 38,322 వార్డు స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. అందులో శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
అలాగే 38,322 వార్డు స్థానాలకు 8,304 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,128 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 78,158 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 7,584 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు పోటీ చేసిన వారిలో 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.