సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ రెండో సెంచరీలు, ఒక అర్థ శతకం సాధించగా.. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ జోడి 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం వీరిని దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనాలని కోరగా.. అందుకు ఈ జోడి ఒకె అన్నట్లు సమాచారం. అయితే ఈ రో-కోల జోడీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాలని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
‘జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎన్నో సంవత్సరాలుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. వారిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఫామ్ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్తేమీ కాదు. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ప్లేయర్ల వలే వీరి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. పరుగులు చేయాలనే తపన ఉండి ఫిట్‌గా ఉన్న నాణ్యమైన ఆటగాళ్లు మనకు అవసరం. ఈ విషయంలో రో-కోకు ఢోకా లేదు. వారిని ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తుంది’’ అని సంజయ్ బంగర్ అన్నాడు.