హైదరాబాద్: ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం నిండు మనస్సుతో ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని అన్నారు. అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించానని తెలిపారు. గత పాలనలో కొనఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశామని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు ఆర్థిక మద్దతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపామన్నారు. కుల సర్వేతో బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శకపత్రం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు ప్రాణం పోశామన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. భారత గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని తెలిపారు.