సెంచరీతో చెలరేగిన యశస్వి
రాణించిన కోహ్లీ, రోహిత్
చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు
విశాఖ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ చెరేగి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు అద్భుతమైనర బ్యాటింగ్‌తో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(106) సెంచరీతో రాణించగా.. మరో స్టార్ ఆటగాడు టెంబా బవుమా(48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి సఫారీ ఇన్నింగ్స్‌కు శుభం కార్డు వేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్(107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(57), రోహిత్ శర్మ(75) అర్ధ శతకాలతో విజృంబించారు. ఇక, గత రెండు వన్డేల్లో చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించలేక పోయారు. కేశవ్ మహరాజ్ ఒక్కడే అద్భుత డెలివరీ వికెట్ దక్కించుకోగా.. మిగతా బౌలర్లు తేలిపోయారు. తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత్‌కు శుభారంభం..
లక్ష్య ఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా.. కుదురుకున్నాక సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నాళ్లు ఫామ్‌లేమితో తిప్పలు పడ్డ జైశ్వాల్.. సెంచరీ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ దూకుడు కనబర్చగా.. జైస్వాల్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 54 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. యశస్వి జైస్వాల్ 75 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడేక్రమంలో రోహిత్ శర్మ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. విరాట్ అండతో జైస్వాల్ కూడా బ్యాట్‌తో చెలరేగాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పోటాపోటీగా పరుగులు రాబట్టిన ఈ జోడీ.. 61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తిచేసింది.