మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాతకమైన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్2కు ఆదివారం తెరలేచింది. స్పోర్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగనున్న టోర్నమెంట్‌లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన పది జట్లు పోటీ పడుతున్నాయి. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటి క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఆరంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా పది జట్లకు సంబంధించి జెర్సీలని ఆవిష్కరించారు.
అంతేగాక టాస్ వేసి తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్‌లు, పోలీసులు, డాక్టర్స్, పొలిటియన్స్ వృత్తుల్లో పని చేసే వారికి సెలవులు ఉండవని, వ్యక్తిగత జీవితం కంటే తమ వృత్తికే ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ వంటి పోటీల్లో పాల్గొనడం కాస్త మానసిక ఉల్లాసం కలిగిస్తుందన్నారు. టోర్నీలో పాల్గొనే జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్టిఓ డైరెక్టర్ చల్లా భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.