హైదరాబాద్: పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ నియంత పాలన, కుటుంబ పాలన చూశామని అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ, రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బిజెపి మహాధర్నా చేసింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో మహాధర్నా చేశారు. మహాధర్నాలో కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ మాయ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప మరేవీ అమలు కాలేదని, రాష్ట్రంలో గులాబీ జెండా పోయి చేయి గుర్తు వచ్చిందంతేనని ఎద్దేవా చేశారు. దోపిడిలో, ఏ వర్గంలోనూ మార్పు రాలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.