ఇరు జట్లకు కీలకం
నేడు విశాఖలో భారత్, సఫారీ చివరి వన్డే
విశాఖపట్నం: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు సాగర తీర నగరం విశాఖపట్నం సిద్ధమైంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం విశాఖ వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది. ఇందులో గెలిచే టీమ్‌కు సిరీస్ దక్కుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో భారత్, రెండో పోరులో సఫారీ టీమ్ జయభేరి మోగించాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ దక్కుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. విశాఖలో కూడా భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. రాయ్‌పూర్‌లో భారత్ భారీ స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేక పోయింది. మొదటి వన్డేలో కూడా 349 పరుగులు చేసినా అతి కష్టం మీద విజయం సాధించింది. ఇరు జట్లకు బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. అయితే బ్యాటర్లు జోరుమీదుందడం కలిస వచ్చే అంశంగా చెప్పాలి.
దూకుడుమీదున్న విరాట్
ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. వీరికి తోడు కిందటి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ కళ్లు చెదిరే శతకంతో అలరించాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి భారీ స్కోరు సాధించాలనే లక్షంతో ఉన్నాడు. రోహిత్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాలని భావిస్తున్నాడు. ఇద్దరు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే కోహ్లి, రుతురాజ్‌లు ధాటిగా ఆడేందుకు వీలుంటుంది. వరుసగా రెండు మ్యాచుల్లో శతకాలతో చెలరేగిన కోహ్లి ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కోహ్లి విజృంభిస్తే భారత్‌కు మరోసారి భారీ స్కోరు ఖాయం. రుతురాజ్, రాహుల్‌లు కూడా తమ బ్యాట్‌లకు పనిచెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను బరిలోకి దించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
జోరుమీదున్న సఫారీ
ఇక సౌతాఫ్రికా కూడా జోరుమీదుంది. మార్‌క్రమ్ కిందటి మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే క్వింటన్ డికాక్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. కానీ కెప్టెన్ బవుమా, మాథ్యూ బ్రిట్జ్‌కి, డెవాల్డ్ బ్రెవిస్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక జాన్సన్, బోస్చ్, మహారాజ్ వంటి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇదిలావుంటే ఇరు జట్లను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి రెండు వన్డేల్లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రెండు జట్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాయి. విశాఖ మ్యాచ్‌లోనైనా బౌలర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.