లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి అన్నారు. శనివారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై డిజిపి శివధర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), ఎక్సైజ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్, ఎక్సైజ్, ఆర్టీసి, చెక్ బౌన్స్, ఇతర కేసులతో సహా వివిధ వర్గాల కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చోరవ చూపాలన్నారు.
ఈ నెల 21వ తేదీన జరిగే జాతీయ లోక్-అదాలత్‌లో పరిష్కరించడానికి మరిన్ని కేసులను గుర్తించాలని ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. త్రిపుర, జార్ఖండ్‌లలో అనుసరించిన విధానంలో బాగంగా కాంపౌండింగ్ ఫీజును తగ్గించడానికి, మద్యం పరిమాణాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా, రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను తగ్గించడంలో తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తామని డిజిపి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు అవసరమయిన అన్ని సూచనలను జారీ చేస్తామని డిజిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, అడిషనల్ డిజిపిలు మహేష్ భగవత్, చారు సిన్హా , అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.