టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(34,357 పరుగులు), విరాట్ కోహ్లీ(27,910 పరుగులు), రాహుల్ ద్రవిడ్(24,064 పరుగులు)లు ఈ ఫీట్ సాధించారు. ఇక, వన్డేలో రోహిత్ 11,441 పరుగులు, టెస్ట్‌లలో 4,301, T20Iలో 4,231 పరుగులు సాధించాడు.
ఇక, మూడో వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తొలి శతకం నమోదు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 10 ఓవర్ల ఉండగానే మ్యాచ్ ను ముగించేసింది. ఈ విజయంతో టీమిండియా 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.