వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో 10 ఓవర్లు ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కెరీర్ లో తొలి శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో జైస్వాల్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగుల అజేయ అర్ధ శతకంతో చెలరేగాడు. దీంతో భారత్ 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.