న్యూఢిల్లీ: గత 70, 80 ఏళ్లుగా భారత్-రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించి సంబంధాలను తిరిగి పటిష్టపర్చుకొనే లక్షం తోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ను సందర్శించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం వెల్లడించారు. పుతిన్ పర్యటన అమెరికాతో భారత్ నెరపుతున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చన్న అభిప్రాయాలను ఆయన కొట్టివేశారు. ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నిటితోనూ భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పర్చుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని, భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏదేశానికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందన్నారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు తగ్గట్టుగానే ఒప్పందం ఉంటుందన్నారు.