న్యూఢిల్లీ : భారతదేశంలో మెకాలే విధానం మానసిక బానిసత్వం అనే విత్తనాలను నాటి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయని, అంటే ఇప్పటికి మరో పదేళ్లు మిగిలి ఉన్నాయని, రానున్న ఈ పదేళ్లలో మనమంతా బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. గర్వంతో కొత్త విజయాలను లక్షంగా చేసుకుని నేడు ప్రతీ రంగం వలసవాద మనస్తత్వాన్ని తొలగించుకుంటోందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం నెలకొన్న వేళ భారత్ ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకెళుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థికానికి మనమే చోదక శక్తి అని నిరూపిస్తోందన్నారు.
హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్‌షిప్ సమిట్‌లో ఆయన శనివారం మాట్లాడారు. “21 వ శతాబ్దంలో నాలుగో వంతు గడిచిపోయింది. ప్రపంచం ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అవాంతరాలు ఎదుర్కొంటోంది. మరోవైపు యుద్ధాలు సవాళ్లు విసురుతున్నాయి. ఇలా పలు రూపాల్లో ప్రపంచం అనిశ్చితులను ఎదుర్కొంటోంది” అని ప్రధాని మోడీ అన్నారు. ఇలాంటి సందర్భంలో ఓ వైపు ప్రపంచ మంతా మందగమనం గురించి మాట్లాడుతుంటే , వృద్ధిలో మనం కొత్త అధ్యాయాలు లిఖిస్తున్నామని అన్నారు. ప్రపంచం చీలిపోతూ విచ్ఛిన్నమవుతుంటే భారత్ ఐక్యతకు వారధిగా పనిచేస్తోందని చెప్పారు.