మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిలకు సంబంధించి మూడు విడతల నామినేషన్ల గడువు ముగిసింది. దాంతో గ్రామాలలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఏ గ్రామంలో ఎవరు పోటీ చేస్తున్నారనేది తెలవడంతో పాటు ఈ విడతలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. తాజాగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు సమయం తక్కువగా ఉండటంతో వివిధ మార్గాలలో ఓటర్లను చేరువ అవుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రణాళికతో ముందడగు వేస్తున్నారు. చాలా వరకు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో యువత, ప్రజలు వివిధ పనులు, ఉద్యోగ ఉపాధి అవసరాల రీత్యా ఉదయం వెళ్లి సాయంత్రం లేదంటే రాత్రి సమయాల్లో తిరిగి ఇళ్లకు వస్తున్నారు.
దీంతో వారిని ప్రత్యక్షంగా కలిసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ప్రచారం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియోలను ఆయా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లు గుర్తుంచుకునేలా వాటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని ఫొటోలు, వీడియోలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రత్యేక ఆకృతులను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు కొత్తగా వాట్సాప్ గ్రూపులను పోటాపోటీగా క్రియేట్ చేస్తున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలను నిలిపివేసే ప్రక్రియ ఉన్నప్పటికీ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగే అవకాశం ఉన్నది.
మూడో విడతలో 27,277 సర్పంచి నామినేషన్లు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండో విడత తరహాలోనే మూడో విడతలోనూ సర్పంచి, వార్డు స్థానాలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడో విడతలో 4,150 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 36,452 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 89,603 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చివరి రోజు శుక్రవారం ఒక్కో రోజే సర్పంచి స్థానాలకు 17,405 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 269 సర్పంచి స్థానాలకు 1,962 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో 169 స్థానాలకు 1,185, నిజామాబాద్ జిల్లాలో 165 స్థానాలకు 1,077 మంది పోటీపడుతున్నారు. ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. ఈనెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.