దేశ ప్రజల్లో జవహర్‌లాల్ నెహ్రూ చరిత్ర కనపడకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. యాభై ఆరేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు ఏమి చేశామో తాము చెప్పగలమని, పదకొండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేశారో చెప్పగలరా? అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రజలు మూడు పూటలా భోజన చేసేలా చేసి, రెండు వందల దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరిన ఘనత నెహ్రూది అని అన్నారు. నెహ్రూ ఆలోచనలతో పరిపాలన, వారి భావాలను అనుసరించి పదేళ్ళు యూపిఏ చైర్మన్‌గా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌తో పాలన చేయించారని ఆయన తెలిపారు. అయితే నెహ్రూ మీద అబద్దాలు చెప్పి చరిత్రను మార్చే కుట్రలు చేస్తున్న మోడీ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదన్నారు. బిజెపి శ్రీ రాముడి ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదని ఆయన విమర్శించారు. అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప ఏమి చేయలేదని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూను కించపరచడం బిజెపి అజెండాగా పెట్టుకున్నదని అన్నారు. నెహ్రూ సిద్ధాంతాలను తాము అమలు చేస్తామని జగ్గా రెడ్డి తెలిపారు.