చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు.
భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఎందుకు సరియైన సమాధానాన్ని అందించారు? ఇది అందరికీ రావాల్సిన ప్రశ్న. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, అనుభవాలు ప్రేరణ.
కుటుంబం, ఉపాధ్యాయుల రోజువారీ దిన చర్యలు, అందించిన చైతన్యం దానికి ఒక ఉత్ప్రేరకం. అంతేకాకుండా ఆయన అమెరికాలో అభ్యసించిన చదువు ఆయనను ఒక తాత్వికుడుగా మలిచాయి. ఆ తాత్వికత దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ, సామాజిక జీవితంలో ఎన్నో సవాళ్లను, సంకటాలను అధిగమించి రెండు వేల సంవత్సరాల కుల వ్యవస్థ విషపు కోరలను పీకగలిగే సమరశక్తిని అందించాయి. బాల్యంలో, విద్యార్థి దశలో ఆయన అనుభవించిన కుల వివక్ష, అమానుషమైన అంటరానితనం ఒక అనుభవాన్ని అందించింది. కుల వివక్ష, అంటరానితనం, పుట్టుపూర్వోత్తరాలను శోధించే ఆలోచనను కలిగించాయి. దానికి కుటుంబంలో నిత్యం బోధించే కబీర్ తత్వాలు ఒక పునాదిగా ఏర్పరిచాయి. అనుభవం, ఆలోచనల నుంచి కులం గురించి అధ్యయనం చేయాలనే కాంక్షను రగిలించాయి. దానికి అమెరికా చదువు ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు ప్రముఖ విద్యావేత్త, జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తత్వశాస్త్రం సిద్ధాంత బలాన్ని కలిగించింది. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి తిరిగి వచ్చి ఆచరణ రూపకమైన కార్యాచరణను రూపొందించుకున్నారు. అది భారత దేశ రూపురేఖలను మార్చివేసింది.
భారతదేశ సమాజం ఆనాడు కులవివక్ష, అంటరానితనం చాలా దుర్మార్గంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. అందుకే ఆయన మొదట సామాజిక అన్వేషణ కులం పుట్టుకపైన సాగించారు. 1916లోనే కులం పుట్టుక పైన ఒక సిద్ధాంత వ్యాసాన్ని పరిశోధన పత్రంగా సమర్పించారు. అందులో కులం పుట్టుకకు ప్రధానమైన కారణం సమాజంలో చదువు, జ్ఞానం కలిగిన ఒక వర్గం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం తమను తాము వేరుపరుచుకొని, తామే ఉన్నతులమని ప్రకటించుకోవడం వల్ల కులానికి బీజాలు పడ్డాయని, అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ వర్గమే పూజారి వర్గం, ఆ తర్వాత బ్రాహ్మణులుగా తమకు తాము గిరి గీసుకొని తమ చుట్టూ కంచే వేసుకున్నారని, ఇది మిగతా తెగలకు ఒక నమూనాగా మారిందని కూడా అంబేద్కర్ తేల్చి చెప్పారు. అయితే కుల వ్యవస్థ హిందూ మతం బోధనలు, మత గ్రంథాల మీద ఆధారపడి ఉన్నదని, అంటరానితనం కూడా అందులో భాగమేనని అంబేద్కర్ వివరించారు.
ఈ పరిశోధన అనంతరం మరొక ఇరవై సంవత్సరాల తర్వాత కుల నిర్మూలన జరగకుండా భారత సమాజంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలకు స్థానం లేదని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. కుల నిర్మూలన అంబేద్కర్ ప్రాథమిక లక్షం.
అయితే అందరి లాగా కుల సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన సమస్యల కలయికగా చూడాలని కూడా అంబేద్కర్ ప్రకటించారు. అంబేద్కర్ 40 సంవత్సరాల రాజకీయ, అధ్యయన, పోరాట జీవితంలో ఈ విషయం మీదనే అధ్యయనం, ఆచరణ సాగించారు.
కులంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, రాజకీయ ఆధిపత్యం కలగలిపి ఉన్నాయి. కులం పుట్టుకకు కారణమైన బ్రాహ్మణ వర్గం ఈ మూడు అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని చాతుర్వర్ణంలోని క్షత్రియ, వైశ్య వర్ణాలను తనతో భాగస్వామ్యం కల్పించింది. అందువల్ల కులాధిపత్యంలో ఒకరికి ముగ్గురు తోడయ్యారు. అందువల్ల కుల సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుగా విస్తరించింది. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ మూడు సమస్యలకు మూడు పరిష్కారాలను చెప్పారు.
మొదటిగా సామాజిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగాలకు అంటరాని కులాలకు, ఇతర వెనుకబడిన కులాలకు, ఆదివాసులకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాలని, దానికి ఆయా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఇప్పటి వరకు విద్య, విజ్ఞాన రంగాల్లో వేళ్లూనుకునిపోయిన వర్గాలతో సమానంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావించారు.
అదే విధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడానికి ఆధిపత్య కులాలతోపాటు ప్రభుత్వ విధి విధానాలలో పాల్గొనడానికి, విధిగా అణగారిన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజకీయ పదవులను అందుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేశారు. వీటితోపాటు ఆర్థికంగా, స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయంతోపాటు, దేశంలోని భూమిని, పరిశ్రమలను, ఆర్థిక సంస్థలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ అంశాలు మాత్రం రాజ్యాంగంలోకి రాకుండా ఆనాటి జాతీయ నాయకులంతా అడ్డుకున్నారు.
కుల వివక్ష, అంటరానితనం తొలగించడానికి కొన్ని రక్షణ చట్టాలను ప్రతిపాదించారు. ఇవన్నీ రాజ్యాంగంలోకి వచ్చాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలన్నింటిని సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొన్నింటిని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. మరి కొన్ని విషయాలను ఆయన రాజ్యాంగంలోకి తీసుకు రాలేకపోయారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కులరహిత సమాజం. దానికి పైన పేర్కొన్న చర్యలు సాధనాలు మాత్రమే. రాజ్యాంగ రచన కూడా అందులో భాగమే. కేవలం రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ లక్షం కాదు.
బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కుల నిర్మూలన అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులతో పాటు కులానికి మూల కారణమైన హిందూమతం తనను తాను సంస్కరించుకోవాలని ప్రతిపాదించారు. కులం, అంటరానితనం మనుగడకు హిందూ ధర్మశాస్త్రాలే కారణమని ఆయన బలమైన విశ్వాసం. ధర్మ శాస్త్రాలన్నింటా కులం, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఇమిడి ఉన్నాయని, వాటిని తిరగరాయాలని, వివక్ష, అణచివేత, వెలివేత లాంటి అంశాలను ప్రతిపాదించే విషయాలను అందులో నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రూపొందించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా హిందూమతంలో పూజారి వ్యవస్థను సంస్కరించాలని హిందువులలో అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలని, దానికి ప్రభుత్వం ఒక బోర్డును స్థాపించి, ఎవరైతే హిందూమతం విధానాలకు అర్హులవుతారో వారిని ప్రభుత్వమే నియమించాలని కూడా తన కుల నిర్మూలన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇటువంటి విధానాలు మాత్రమే కులాన్ని నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. అందువల్లనే బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కర్తగా కాకుండా విప్లవకారుడుగా నిలిచారు. కుల వివక్షపైన మహాత్మాగాంధీతో పాటు ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. కాని ఎవ్వరూ ఇటువంటి విప్లవాత్మకమైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్కాలిక ఉపశమనాలతో పాటు సంపూర్ణంగా మార్చివేయగలిగే విప్లవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా మంది సంస్కర్తలకు భిన్నంగా భారతదేశ దశ దిశ నిర్దేశకుడుగా, సామాజిక విప్లవకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో ఒకడిగా కాకుండా తానే ఒక చరిత్రగా నిలిచిపోయాడు.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం