ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గౌరవప్రదమైనదని తెలంగాణ సిఎంకు పంపిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఈ గ్లోబల్ సమ్మిట్ సార్థక చర్చలకు వేదికగా నిలవాలని, రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మారాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని చెబుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మమతా బెనర్జీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి సీతక్క, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లాల్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో మమతా బెనర్జీ బిజీగా ఉండటంతో, వ్యక్తిగతంగా కలవడం కష్టమని ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. అనుగుణంగా మమతా బెనర్జీ కార్యాలయంతో సమన్వయం సాధించిన మంత్రి సీతక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అధికారిక ఆహ్వాన పత్రికను ఇ-మెయిల్ ద్వారా పంపించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న అనంతరం మమతా బెనర్జీ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.