గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు.తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించి, గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేశారని అన్నారు. ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కెసిఆర్ సేవలను తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు అనే పుస్తకాన్ని కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు ఆగస్టు 2వ తేదీన అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవిప్రసాద్, బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.