మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. ప్రజలకెవరికీ లేని, రాని మనోభావాల గొడవ సదరు గుంపు వారికే కలగటం వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కు కావొచ్చు. ముఖ్యమంత్రి మాటల దగ్గరకి వస్తే -ఆయన హిందూమతం లోని బహు దేవతారాధనను ప్రస్తావించారు. ఎవరికినచ్చిన దేవుణ్ణి వారు మొక్కుతారు అన్నట్టు మాట్లాడారు.
ఎవరి మనస్తత్వానికి దగ్గరగా వుండే దేవుడిని వారు మొక్కుతారని అన్నారు. ఇదంతా ఆయన కేవలం దైవసంబంధమైన చర్చలో భాగంగా మాట్లాడింది కాదు. ఆనాటి సభలో కాంగ్రెస్ పార్టీలో గల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి సమర్థనగా మాత్రమే ఈ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాటల్లో కూడా తప్పులేదు. దేవతలను కించపరచటం అన్న సమస్యే అందులో లేదు. కానీ ఈ రభస చేస్తున్న వాళ్లకు మాత్రం అందులో తప్పు కనిపించింది. ఇదే గమ్మత్తు. మొన్న నాకు దేవుని మీద నమ్మకం లేదన్న పాపానికి దర్శకుడు రాజమౌళిని ఇలాగే ఇబ్బందిపెట్టారు. ముఖ్యమంత్రి దేవుళ్లను విశ్వసించని వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా హిందువే కదా! ఫలానా పార్టీలో ఉన్న హిందువులు మాత్రమే నిజమైన హిందువులుగా, మిగిలిన వారు కానట్టుగా, వాళ్లకు మతం మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఉంది వీళ్ల ప్రవర్తన. ఆలయాల్లోకి తోటి హిందువులైన దళితులను అనుమతించకుండా అవమానిస్తుంటే దాని మీద స్పందించకుండా మౌనవ్రతాన్ని పాటించే ఈ అపర భక్తశిఖామణులు ఇట్లాంటి అనవసర రాద్ధాంతాలు దేవుళ్ల పేరుతో చేయటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు మతం మీద రాజకీయాలు చేయటం తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవు. సదరు వ్యక్తులు తమ రాజకీయ జీవితంలో ప్రజలకోసం కనీసం ఒక్క శాతమైనా సమయాన్ని కేటాయించారో లేదో తెలియదు.
కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ మత రాజకీయాలకే కేటాయిస్తారు. అయితే హిందూమతం మీద గుత్తాధిపత్యం ఉన్నట్లుగా మాట్లాడే వీళ్లకు ఆ మతం తాలూకు చరిత్ర, దాని లోతులు గానీ తెలియవు. తెలిసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప మతాన్ని అధ్యయనం చేసి దాని సారాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పం ఉన్నవాళ్లు కాదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామంచంద్రా’ అని ఆవేదనతో భక్త రామదాసు పలికిన మాటల్లో భక్తి లేదా? నిష్కల్మషమైన భక్తితో తిన్నడు శివునికి మాంసం నైవేద్యంగా సమర్పించటాన్ని ఎవరైనా దోషంగా చూడగలరా? ఇట్లాంటి ఉదంతాలు హిందూమతంలో కుప్పలుగా దొరుకుతాయి.
భక్తికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఎవరి మార్గం వారికుంది. భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన నవవిధ భక్తిమార్గాలకు తోడుగా అనేక మార్గాలు దేవుడనే భావనచుట్టూ రూపొందాయి. దేవుడికి, భక్తునికి మధ్య ఇలాంటివాళ్ల జోక్యం ఎందుకో మరి? మొన్నటికి మొన్న గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కల్ని అవమానిస్తూ వాళ్ళసలు దేవుల్లే కాదన్నాడు చినజీయర్ స్వామి. ఇప్పుడు నానాయాగి చేస్తున్న ఈ గుంపులోని వారు ఒక్కరూ నోరెత్తలేదు. షిరిడి సాయిబాబా మీద ఒక వర్గం వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ల మనోభావాలు దెబ్బతినలదు. కోట్లాది హిందువులు అటు సమ్మక్క సారక్కలను, ఇటు సాయిని కొలుస్తున్న సంగతి వీళ్లకు తెలియదా? మతం మీద శ్రద్ధ వల్లనో, దేవుని పట్ల భక్తి చేతనో వీళ్ళు రోడ్లెక్కటం లేదు. కేవలం రాజకీయాలలో భాగంగానే మతాన్ని, దేవుళ్లను పావులుగా వాడుకుంటున్నారు. మతానికి మేమే రక్షకులం అన్నట్టు వీళ్లకు వీళ్ళే కితాబిచ్చుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మతం కానీ, దేవుళ్ళు కానీ వారి స్వంత ఆస్తి. అందుకే దేవతల ప్రస్తావన ఎవరు తెచ్చినా అందులో ఉన్న సమాచారంతో సంబంధం లేకుండా వారి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజల మద్దతు ఉన్నదనే భ్రమల్లో వాళ్ళున్నారు. పాపం వాళ్ళది భ్రమ అన్న సంగతి వాళ్లకు ఎప్పుడర్థమవుతుందో?
తోకల రాజేశం
96767 61415