ఇవాళ ప్రపంచాన్ని కింది నుంచి పైకి చూసినా, పైనుంచి కిందికి చూసినా ఒకే దృశ్యం. నిష్ఫల హింసతో నెత్తురోడుతున్న వర్తమానం. ఇది ఆశ నిరాశల బాధాకర సమ్మిశ్రమం కూడా. మన కళ్ల ముందే, యుక్రేన్ దేశం ఇక ఇప్పుడిప్పుడే కోలుకోలేనంతగా ఛిద్రమయిపోయింది. పశ్చిమ రాజ్యాలు యుక్రేన్ ద్వారా రష్యాకు పక్కలో బల్లెం కావాలనుకున్నాయి. కుదరలేదు. రాపిడి యుద్ధం (వార్ అఫ్ అట్రషన్) మాత్రం కొనసాగుతోంది. జనాన్ని బలవంతంగా యుద్దభూములకు తరలిస్తున్నారు. నగరాల్లో పవర్ గ్రిడ్స్ బద్దలైపోయాయి. యుక్రేనియన్లు చీకటిలో, చలిలో ముడుచుకుంటున్నారు.
సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాల పరోక్ష వత్తాసుతో(నే) పాలస్తీనా, సిరియా దేశాలలో అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగుతోంది. పాలస్తీనా పెద్ద శవాల గుట్టగామారింది. అలాగని ఇజ్రాయిల్, అమెరికా పెత్తనం కూడా నిలబడడం లేదు. పశ్చిమ దేశాల ఆర్థిక మాంద్యాన్ని యుద్ధాలూ, సుంకాలు పరిష్కారించలేకపోయాయి. అమెరికా, యూరప్ సహా అన్ని దేశాల్లో విచిత్రమైన నిరుద్యోగం విస్తరిస్తోంది. జెన్ జీ అనబడే నవతరం ఎక్కడికక్కడ తిరగుబడుతోంది. తిరగబడి ఏం చేయాలో తెలియక తికమక పడుతోంది. తమకేం కావాలో, అసలు తాము ఎవరో తెలియక తికమకపడుతోంది. నిన్నటి నిర్వచనాలేవీ వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడం లేదు. వాళ్లు కార్మికులా? రైతులా? బూర్జువా బిడ్డలా? పశ్చిమ రాజ్యాల మానస పుత్రులా?
సమాజంలో ఆర్థిక వర్గాల పొందికలో గణనీయమైన మార్పు వచ్చింది. నిన్నటి శ్రామికుల పిల్లలు ఇవాళ శ్రామికులు కారు. వాళ్లు మధ్యతరగతి వర్గంలో చేరిపోయారు. ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక ప్రజలు అసల్లేరని కాదు. బాగానే ఉన్నారు. జనాభాలో వారి శాతం గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా అంటే, వాళ్ల సమస్యలపై వీధులకెక్కి పోరాడ్డానికి తగిన శాతంలో నిరుపేదల జనాభా లేదు. బహుశా, ఇదే ఇవాళ వామపక్షాల ఇర్రిలవెన్సుకు కారణం. ఇదే ‘జెన్ జీ’ ఫినామినన్ కు మూలం. ఈ సరికొత్త వర్గ-పొందికకు తగిన వ్యూహం, ఎత్తుగడలను అన్వేషించాల్సి ఉంది.
మునుపటి పేదలు చాల మంది కొత్తగా మధ్య తరగతిలో చేరిపోయారు. మధ్యతరగతి ప్రజలు మునుపటి కన్న ఎక్కువగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. తాత్వికంగా గుర్తింపుచేతనా (ఐడెంటిటీ) రాజకీయాలకు ఇదే పునాది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ (మాగా), పాన్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో తెల్ల భూస్వాముల భయాలు, ఇండియాలో మాలమహానాడు, మాదిగదండోరా, బీసీల ఐక్యత, మైనారిటీల అభద్రత, రెడ్ల, కమ్మల వనభోజనాలు, బ్రాహ్మణ సంఘాలు… ఇవి కాక మిగిలిపోయిన పేద శ్రామికులు పోరాటాలకు తగిన శాతం లేరు. అంటే, పోరాడితే తప్ప బతుకు లేని వాళ్లు… సామాజిక చలనాల్ని నిర్ణయించడానికి… తగిన సంఖ్యలో లేరు. ఈ పేదలు సంఖ్య రీత్యా తక్కువే గాని, వారి దుఃఖం మాత్రం చాల ఎక్కువ.
ఆ దుఃఖం ఎలా ఉంటుందో మొన్న కోవిడ్ సమయంలో చూశాం. పేదలు తాము ఉన్న చోట్లలో బతకలేక, పనులు వెదుక్కుంటూ వలసపోయేవారు. ఆధునిక యుగంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వలసలు ఎక్కువయ్యాయి. కోవిడ్ ‘లాక్ డౌన్’ సమయంలో బయటికి వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేదు. వలస వచ్చిన వాళ్లకు కొత్త చోట్ల కూడా పనులు లేకుండా పోయాయి. పనులు లేక, లాక్ డౌన్ కారణంగా పిల్లా పాపలతో తలదాచుకునే చోటు లేక, కనీసం బంధుమిత్రులతో కలిసి ఉందామని దక్షిణాది నుంచి తిరిగి తమ ఊళ్లకు నడిచి వెళ్లారు. బస్సులు, రైళ్లు ఎక్కడానికి వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. ప్రభుత్వాలు ఆదుకోలేదు. అలాంటి తిరుగు వలసలలో ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు. ఉదాహరణకు… తిరుగు-వలస ప్రయాణంలో ఒక రైలు స్టేషన్ వద్ద శవమై పడి వున్న ఒక అమ్మ. చిరుగుల బనియన్ తో అభంశుభం తెలియని ఆమె పిల్లవాడు. పిల్లవాడు పాల కోసం అమ్మ పైట కొంగు తీస్తున్న దృశ్యాన్ని చాల మంది చూసి ఉంటారు. కెమెరా కంట బడని దృశ్యాలు ఇంకెన్నో.
అంత ఘోరకలిలో ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేశాయి. ప్రైవేటు వితరణతో దొరికిన కొంత ఉపశమన తప్ప వాళ్లనెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఉద్యమాలేమీ జరగలేదు. ఇంత ఉదాసీనతకు కారణమేమిటి? ఆ బాధితులు బాగా అట్టడుగు జనం. జనం ఉన్నారు గాని, జమగూడి పోరాడేందుకు తగినంతమంది (క్రిటికల్ మాస్) లేరు. వ్యవస్థను ఎదిరించి, డిమాండ్ చేసి సాధించుకోడానికి తగినంత మంది నిరుపేదలు లేరు. బహుశా, ఈ నిస్సహాయతే, తీవ్ర సమస్యలు ఉండీ పోరాటానికి తగిన మానవ సంఖ్యలేని నిస్సహాయతే, ఇక అడుగు ముందుకు పడని నిస్సహాయతే… ఇటీవలి మావోయిస్టు ఉద్యమంలో ఏర్పడిన ప్రతిష్టంభనకు కూడా మూల కారణం. నక్సలైట్లు ఏదో ఒక సమస్య మీద కాకుండా వ్యవస్థను సమూలంగా మార్చాలనుకునే యోధులు. అది రాజ్యానికి అస్సలు ఇష్టం ఉండదు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో రాజ్యం మావోయిస్టుల మీద అలివిగాని దాడులు మొదలెట్టింది. కొన్ని మాత్రమే నిజమైన ఎన్కౌంటర్లు. చాల ఎన్కౌంటర్లు బూటకం. ఏది నిజం ఎన్కౌంటరో ఏది బూటకమో నిర్ణయించలేని దుస్థితి. ఈ దుస్థితికి కారణం నక్సలైట్లు అనుసరించిన రహస్యగోపన పనివిధానం అని చెప్పక తప్పదు.
యుద్దం చేసే యోధులకు దాడులు చేయడమే కాదు, ఆత్మరక్షణ చేసుకునే విద్య కూడా తెలియాలి. ముందుకు పోవడం మాత్రమే కాదు, వెనక్కి తగ్గే విద్య కూడా తెలిసి ఉండాలి. రెండవది తెలియని సైనికులు తమ అజ్ఞానానికి తాము బలి అవుతారు. తమతోపాటు తమ వెంట నడిచే ప్రజల్నీ బలి చేస్తారు. నక్సలైట్/మావోయిస్టు ఉద్యమంలో ఈ రకం బలిదానాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ఆపరేషన్ కగార్ లో రాజ్యానిదే పైచేయి అయ్యింది. అది అనూహ్యం కాదు. అనివార్యం కూడా. అడివి ఉద్యమానికి రాజ్యంతో యుద్ధానికి తలపడే శక్తి లేదు. నిర్బంధానికి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని మృత నేత బసవరాజుతోపాటు చాలమంది ఉద్యమ నాయకులు గ్రహించారు. ‘వికల్ప్’ పేరుతో పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని అందరూ చూసి/విని ఉంటారు. సాయుధపోరాటం విరమిస్తామనీ, అయితే, ఆ సంగతి తమలో తాము చర్చించుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఆ లేఖ/విజ్ఞప్తి సారాంశం.
వెంటనే లొంగిపోవడం (సరెండర్ కావడం) వినా మార్గం లేదని ప్రభుత్వం మొండికేసింది. ‘ఆపరేషన్ కగార్’ కొనసాగించింది. మల్లోజుల, ఆశన్న తదితర నేతలు పలువురు అనుచరులతో పాటు ఏకపక్షంగానే సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వాళ్లు ద్రోహులు అని ప్రకటించిన వాళ్లలో మరి చాలమంది ఇప్పుడు అదే విజ్ఞప్తి చేస్తున్నారు. తామూ ఆయుధాలు విసర్జిస్తామని, చర్చించుకోడానికి సమయం కావాలని అడిగారు. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రకటన కర్తలు కొందరు ఏకపక్షంగా లొంగిపోయారని… ఈ వ్యాసం రాస్తున్న సమయంలో బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వయ్యెస్సార్ ముఖ్యమంత్రిత్వం కింద ఒకసారి శాంతికి సదవకాశం వచ్చింది. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య ఒక పద్ధతిగా చర్చలు జరిగి గౌరవప్రద ఒప్పందానికి అవకాశం కనిపించింది. శాంతి ఒప్పందం కుదరాలంటే నక్సలైట్లు ఆయుధాల్ని విసర్జించాలని ప్రభుత్వం నిబంధించింది. అది తప్పు అని అనలేం. సమాజంలో ఒక సెక్షన్ ప్రజలకు ఆయుధాలు ధరించే స్వేచ్ఛను ఏ లెజిటిమేట్ ప్రభుత్వం ఇవ్వదు. అలా అనుమతించడానికి ‘రాజ్యాంగం’ అంగీకరించదు. ఆ మాత్రం తెలీకుండా శాంతి చర్చలకు వెళ్లడం అమాయకత్వమే.
ఆనాడు ఆయుధాల అప్పగింతకు అంగీకరించక ‘యుద్ధం’ కొనసాగించడానికే మావోయిస్టులు నిశ్చయించారు. ఇవాళ ఆయుధ విసర్జనకు సిద్ధమే గాని, తమలో తాము మాట్లాడుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఒకటికి రెండు సార్లు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. రిట్రీట్ తప్పు కాదు గాని, అది ఇంత గందరగోళంగా ఉండాల్సింది కాదు. లొంగుబాటు (సరెండర్) అవమానకరం కాదు. ఫలానా రాజ్యాంగానికి విధేయులం అని ప్రకటించుకోవడం ఆ దేశపౌరులకు అవమానకరం కాదు. జనసందోహంలో కలవడానికి అంతకు మించి పద్ధతి ఏదీ లేదు. మావోయిస్టులు తమ పాత ప్రకటనలకు బలైపోకుండా, ఆయుధాలు విసర్జించాలి. నీళ్లలో చేపల్లా ప్రజలలో కలిసిపోవాలి. ఎక్కడో అడివిలో ఒక మూలన ఏర్పరిచే ‘జనతన రాజ్యాలు’ ప్రజలకు మేలు చేయవు. జనతన రాజ్యాల రక్షణ పేరిట పెట్టిన మందుపాతరలు మేలు చేయవు. గిరిజన బాలలు మైదానాల్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వంటి సౌకర్యాల్ని ఉపయోగించుకుని చదువూ సంధ్యా నేర్చుకుని మిగతా దేశ ప్రజలందరిలాగే పురోగమిస్తేనే నేటి వెనుకబాటుతనం తొలగిపోతుంది. దీనికి దోహదం చేయడమే గిరిజన బిడ్డలతో సహా ప్రజలను, దేశాన్ని ప్రేమించే కమ్యూనిస్టులందరి కర్తవ్యం.
– హెచ్చార్కె
(ప్రముఖ కవి, రచయిత)