మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశా లు జరుగుతాయని తెలిపారు. 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, జూన్ నా టికి మరో 2లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏ డాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లే కుండా, కులమత బేధాలు లేకుండా పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపా రు. లబ్దిదారుల ఖాతాలకే నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో కొంతమంది పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించామని అన్నారు.
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతోపాటు భవిష్యత్తులో పేదల ఇండ్లకు ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పథకాలను వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు..ఆత్మగౌరవం, భద్రత, భరోసా అని వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల నిర్మాణంపై తమ ఎన్నికల వాగ్దానాలను అమలు చేసేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఇంటి స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. మూడో విడతలో వచ్చే ఏడాది ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు.
నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక
రాష్ట్రంలోని జిహెచ్‌ఎంసితో సహా అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక సిద్దమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ నగరాలలో అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జి ప్లస్ 3 లేదా జి ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వరలో పాలసీని ప్రకటించబోతున్నామని వెల్లడించారు. పట్టణాలలో నివాసం ఉండే చిరువ్యాపారులకు, చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారికి దూరం ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తే వారు అక్కడ నివాసం ఉండటం లేదని, వారు మళ్లీ నగరంలోని మురికివాడల్లోనే నివాసం ఉంటూ తమ జీవనోపాధికి అవసరమైన పనులు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోనే పేదలకు ఇండ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి వారికి కేటాయించిన ఇండ్లను ఆయా ప్రాంతాలలో అర్హులైన పేదలకు ఇస్తామని తెలిపారు. నగరంలో నివాసం ఉండే చిరువ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి కోసం నగరంలోనే ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
మధ్యతరగతి ప్రజలకు ఇండ్ల కోసం త్వరలో కొత్త పాలసీ
మధ్యతరగతి ప్రజల సహా అందరికీ అందుబాటులో ఉండే విధంగా(అఫర్డబుల్ హౌజింగ్ స్కీం) రెండు మూడు నెలల్లో పాలసీని ప్రకటించబోతున్నామని పేర్కొన్నారు. దీనికోసం ఓఆర్‌ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని తెలిపారు. వైఎస్‌ఆర్ హయాంలో తీసుకువచ్చిన రాజీవ్ స్వగృహ పథకం తరహాలో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం త్వరలో కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా రద్దు చేస్తే పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్దరించామని, దీనికోసం 394 మంది డిఇలను వెనక్కి రప్పించి 800 మంది కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నామని తెలిపారు. వివిధ శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. హౌజింగ్ బోర్డు లీజుకు వచ్చిన సుమారు వెయ్యి ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నవాటిని తొలగించి హైరైజ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. గృహ జ్యోతి పథకంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
హిల్ట్ పాలసీపై కెటిఆర్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్
హిల్ట్ పాలసీపై బిఆర్‌ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో హిల్ట్ పాలసీపై బిఆర్‌ఎస్ ఆరోపణలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బిఆర్‌ఎస్ పాలనలో వచ్చినవే అని, ఆ ఫైల్‌పై మంత్రిగా కెటిఆర్ సంతకం చేసిన సంగతి మరిచారా…? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారని అన్నారు. హిల్ట్ పాలసీని దోపిడీ పాలసీ అంటున్న కెటిఆర్‌కు ఇవి గుర్తులేవా..? అని అడిగారు. ఓఆర్‌ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా కొడుకు పరిశ్రమల శాఖ మంత్రిగా కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్షన్ చేశారు.. ప్రభుత్వ భూములు వేలం వేశారని అన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌బి నగర్‌లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చిందని, అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ తోటి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. ఈ కెమికల్ ఇండస్ట్రీని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది బిఆర్‌ఎస్ కాదా..? అని ప్రశ్నించారు. ఈ ఫైలుపై అయ్యా కొడుకులు సంతకాలు చేయలేదా.. ఏ పాలసీతో ఈ కన్వర్షన్ చేశారు..? అంటూ నిలదీశారు. ఐడిపిఎల్‌లో కూడా ఇదే విధంగా చేశారని అన్నారు. కెటిఆర్ కడుపునిండా విషమే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిల్ట్ పాలసీపై బిజెపి, బిఆర్‌ఎస్‌ది ఒకే డ్రామా అని, స్క్రిప్ట్ రాసేది ఒకరు… డెలివరీ చేసేది మరొకరు అని విమర్శించారు.
నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి
తప్పు చేస్తే తన కుమారుడైనా, తాను అయినా శిక్షకు అర్హుడేలమే అని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని అన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని తన కుమారుడిపై కేసు నమోదు చేయవద్దని చెప్పే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కేసు నమోదైన తర్వాత విచారణలో నిజ నిర్ధారణ జరుగుతుందని పేర్కొన్నారు.