టీమిండియాకు తప్పని కష్టాలు
మన తెలంగాణ /క్రీడా విభాగం: సౌతాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్‌లు శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 359 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని ఉంచినా సౌతాఫ్రికా మరో 4 బంతులు మిగిలివుండగానే దీన్ని ఛేదించి ఔరా అనిపించింది. అంతకుముందు తొలి వన్డేలో కూడా భారత్ ప్రత్యర్థి ముందు క్లిష్టమైన 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి సయితం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి అతి కష్టం మీద 17 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
కొన్ని రోజుల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత బౌలర్లు విఫలమయ్యారు. పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. తాజాగా వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు బౌలింగ్ కష్టాలు తప్పడం లేదు. సిరాజ్, బుమ్రాలను తప్పిస్తే మరే బౌలర్ కూడా మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు ఘోర వైఫల్యం చవిచూశారు.ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సుందర్ తదితరులు పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచారు. పరిస్థితులను గమనిస్తే టీమిండియా పేస్ దళం మసకబారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైన జట్టు యజమాన్యం బౌలింగ్‌ను మెరుగు పరచడంపై దృష్టి సారించాలి. సీనియర్ బౌలర్లు షమి, బుమ్రా, సిరాజ్‌లను ప్రతి సిరీస్‌లోనూ ఆడించాలి. అనవసర ప్రయోగాలకు స్వస్తి పలికి బౌలింగ్ బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.