మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంది రా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి గడ్డం వివేకానంద, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యుడు దండే విఠల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఖానాపూ ర్ ఎంఎల్‌ఎలు పాయల్ శంకర్, గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప లు అభివృద్ధి పనులకు ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో 700 ఎకరాలలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో భూసేకరణకు జీవో జారీ చేశామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ కోసం భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించిందని, సంవత్సరంలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బ స్సు రావడమే కష్టంగా ఉన్న ఎయిర్ బస్సులను నడిపిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ఉంటే ఇక్కడి అభరణ్యంలో ఉన్న పులులను చూడడానికి ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తారని అ న్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేద ప్రజల ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షాలను సైతం కలుపుకుని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని, కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాబోవు 2 నెలలలో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ఒకచోట చేర్చి నివేదికలు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో తుమ్మిడిహెట్టి నుండి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 38 వేల 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా కోసం టెండర్లు పిలిచారని, వ్యవసాయ భూములకు గోదావరి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని అపారమైన సున్నపు గనులను వినియోగించుకుని సిమెంటు కర్మాగారాలను నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తామని తెలిపారు. ఖమ్మంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి ఉద్యోగ భర్తీ చేసేందుకు కృషి చేసి 61 వేల మంది నిరుద్యోగులకు ఎల్.బి. స్టేడియంలో ప్రజల సాక్షిగా నియామక పత్రాలను అందించామని తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహించి 562 మంది గ్రూప్ 1 అధికారులను నియమించామని, గ్రూప్ 2లో 785 మందికి, పోలీస్, వైద్య శాఖతో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలు కల్పించి తెలంగాణ పునర్నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేశామని తెలిపారు. రాబోవు రోజులలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ యువత అధికారులుగా, ఉద్యోగులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి 2 సంవత్సరాల కాలంలో 8 వేల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలోని ఆడబిడ్డలను అన్ని వ్యాపార రంగాలలో ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టే తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను అందించామని తెలిపారు. -2026 మార్చిలో అన్ని మున్సిపాలిటీలలోని మహిళలకు అందిస్తామని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తామని, కుటుంబ మర్యాదను నిలబెట్టే విధంగా ఆడబిడ్డలను ఇంటి యజమానులను చేశామని తెలిపారు. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడిందని, రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరును ఎండగట్టారు.