ఇంటి టెర్రస్‌పై గంజాయి మొక్కలను పెంచిన ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. రెండు మొక్కలు ఆరు మీటర్లు ఎత్తున పెరిగాయి. రెండు గంజాయి మొక్కలు, 55 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లవకుశ, బీమ్లేష్ ఇద్దరు మలక్‌పేట్‌గంజ్ మిషన్ మార్కెట్ సమీపంలోని ఇంటిలో ఉంటున్నారు. కింద షాపులు ఉండగా పైన బిల్డింగ్‌పై ఉంటూ రెండు గంజాయి మొక్కలను పెంచారు. టెర్రస్‌పై ఆరు నెలల నుంచి గంజాయి మొక్కలను పెంచుతున్నారు, వాటిని ఎపుగా పెరిగిన తర్వాత గంజాయిగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ సిబ్బంది తెలియడంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడి చేశారు. రెండు గంజాయి చెట్ల నుంచి సుమారు 10 కిలోల గంజాయి దిగుబడిగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. నిందితులను గంజాయి మొక్కలను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.