ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితమైన హోల్డింగ్ ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.. కానీ అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.180 మందికి పైగా ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్‌లో దిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
“హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ అందిన తర్వాత విమానం అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయింది. విమానాన్ని హైదరాబాద్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతిస్తే, బాంబు పేల్చివేస్తామని ఆ మెయిల్ బెదిరించింది. అందుకే అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ జరిగింది” అని అహ్మదాబాద్ జోన్ ఫోర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ బన్సాల్ తెలిపారు.