సాధారణంగానే మిలిటరీ రూల్స్ కఠినంగానే ఉంటాయి. అందులోని మాన్యువల్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘనలకు ఎలాంటి మన్నింపులు, మాఫీలు ఉండవు. సైన్యంలో చేరేముందే వీటన్నింటిని గురించి ఆలోచించుకోవాలి. సాధారణ పౌరుడికి లభించే స్వేచ్ఛ కూడా కొన్ని సందర్భాల్లో సైనికులకు నిరాకరించవచ్చు. కోర్టులు కూడా సైనికుడి వాదనను త్రోసిపుచ్చుతాయి. కవాతులో భాగంగా పరమత దేవాలయంలోకి వెళ్లి పూజను ఆచరించకున్నా క్రమశిక్షణ తప్పిన కిందికే లెక్క. క్రైస్తవ మతానికి చెందిన సైనిక అధికారి సామ్యూల్ కమలేశన్ తన రెజిమెంట్ పాటించే హిందూ మత ఆచారాలను పాటించనందుకు క్రమశిక్షణ చర్యగా 2021 లో తన ఉద్యోగం కోల్పోయాడు. ఆర్మీ చట్టంలోని సెక్షన్ 19, ఆర్మీ రూల్స్‌లోని రూల్ 14 ప్రకారం తమ చర్య సక్రమమే అని సైన్యం అంటోంది. తనను తిరిగి ఉద్యోగం లోకి తీసుకోవాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఫలితం ఇవ్వలేదు. రెండు కోర్టులు సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాయి.
పంజాబ్ లోని మూడవ కల్వరి రెజిమెంట్ లో సామ్యూల్ కమలేశన్ లెఫ్టినెంట్ కల్నల్ గా 2017 లో చేరాడు. ఆ యూనిట్‌లో హిందూ గుడి, గురుద్వారా మాత్రమే ఉన్నాయి. వారంలో ఒకసారి సైనికులంతా కవాతుగా వెళ్లి ఆ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. వారితో గుడుల దాకా వెళ్లిన ఆయన హారతి సమయంలో బయటే ఉండిపోయేవాడు. ఈ ప్రవర్తన ఆర్మీ నిబంధనలకు విరుద్ధమని ఆయనకు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయన రెజిమెంటల్ పరేడ్‌లో పూర్తిగా పాల్గొన లేదని, ఆర్మీ చట్టంలోని సెక్షన్ 41 పై అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం నేరమని కూడా పేర్కొంది. తన క్రైస్తవ విశ్వాసాలు ఇందుకు అనుమతించవని ఆయన అధికారులకు స్పష్టం చేశాడు. సుదీర్ఘ విచారణ తర్వాత అతను 2021 లో సర్వీస్ నుండి తొలగించబడ్డాడు.
తన తొలగింపును సవాల్ చేస్తూ కమలేశన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మతపరమైన కవాతులో పాల్గొననందుకు ఆయనను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. మన సైన్యం అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల ప్రజలతో రూపొందించబడింది, దీని ఏకైక లక్ష్యం దేశాన్ని రక్షించడం మాత్రమే. సైన్యం ఐక్యత వారి యూనిఫాం ద్వారా ఏర్పడుతుంది. కమలేశన్ ప్రవర్తన సైన్యం లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. తన రెజిమెంట్‌లో గుడి, గురుద్వారా ఉన్నాయని, అయితే అన్ని మతాలకు సంబంధించిన ‘సర్వ ధర్మ స్థల్’ లేదని, చర్చి కూడా లేదని కమలేశన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని రెజిమెంట్ల పేర్లు లేదా సంప్రదాయాలు ఏదైనా మతం లేదా ప్రాంతంతో ముడిపడి ఉన్నప్పటికీ ఇది సైన్యం లౌకిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని కోర్టు పేర్కొంది. అధికారి ప్రవర్తన రెజిమెంట్ ఐక్యత, క్రమశిక్షణ, లౌకిక విలువలకు హాని కలిగిస్తుందని హైకోర్టు అంగీకరించింది. యుద్ధ పరిస్థితుల్లో సైన్యంలో ఇటువంటి ప్రవర్తన హానికరమని, కమలేశన్ తన సీనియర్ అధికారుల ఆదేశాల కంటే తన మతానికి ప్రాధాన్యత ఇచ్చాడని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
చివరకు సుప్రీంకోర్టు కూడా కమలేశన్ తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీం కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం ఒప్పుకోలేదు. పూజ లేదా హారతి లాంటివి తన క్లయింట్ విశ్వాసానికి విరుద్ధం. రెజిమెంట్ వెంట తను వెళ్లేవాడు, కానీ లోపలికి వెళ్లి పూజలు చేయలేడు. అక్కడ ‘సర్వ ధర్మ స్థల్’ లేదు. దేవాలయాలు, గురుద్వారాలు మాత్రమే ఉన్నాయి. తనను ఏదైనా పూజ చేయిస్తారేమోనని భయపడ్డాడు అని న్యాయవాది వివరించగా కోర్టు ఆ మాటలని తోసిపుచ్చింది. సైనికుల మనోభావాలను మీ క్లయింట్ గౌరవించలేదు. ఆయనను ఎలాంటి పూజలు చేయమని ఎవరూ అడగలేదు. సైనికులతో కలిసి ఉండడం ఆయన విధి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి సెంటిమెంట్‌ను రక్షించదు. దేవాలయంలోకి అడుగు పెట్టడం క్రైస్తవ మతంలో ఎక్కడ నిషేధించబడింది అని ప్రశ్నించింది. ఇది భారత సైన్యం, ఇక్కడ సెక్యులరిజం అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేదు. ఆయన వంద విషయాల్లో మంచివారు కావచ్చు, కానీ ఈ తప్పు చాలా పెద్దది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేము. హైకోర్టు ఆదేశాలను కొనసాగిస్తాం అని సుప్రీం నిర్ణయించింది.
వ్యక్తిగత మత విశ్వాసాలు పక్కన బెట్టి సైన్యం లౌకికతకి విలువనీయడం గొప్ప విషయమే. కానీ దాని వల్ల అన్ని మతాల వారికి సమాన అవకాశాలు లభించాలి. దేవాలయ సముదాయం ఒక్క ఆవరణలో ఉంటే సైనిక క్రమశిక్షణకు తప్పే అవసరం ఎవరికీ పడదు. ఇలా ఓ మైనారిటీ వర్గానికి చెందిన అధికారి మత విశ్వాస నమ్మిక వల్ల ఉద్యోగానికే ముప్పు వాటిల్లే పరిస్థితులు రావడం విచారకరమే. అయితే ఈ కేసు కొత్తగా ఒక రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తింది అనవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం ఒక మత విశ్వాసాన్ని ప్రకటించే, ఆచరించే హక్కు సైనిక క్రమశిక్షణకు లోబడి ఉందా అనే చర్చ అవసరం.
– బి.నర్సన్, 94401 28169