భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా , ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు.భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమో అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్‌ను బెదిరించే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పుతిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకో లొంగేరకం కాదని , ఆయన పద్ధతి ప్రకారం ఆయన వ్యవహరిస్తూ వెళ్లుతాడని స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల బెదిరింపులతో భారత్‌ను భయపెట్టాలనేది అమెరికా ఆలోచనగా ఉందన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో చారిత్రక ఎకటెరినా కథరైన్ హాల్‌లో ముందుగానే రికార్డు చేసిన ఇంటర్వూ ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన దశలో ప్రసారం అయింది.
భారత్‌కు రస్యా చమురు వద్దంటున్న ట్రంప్ వాదనలో పసలేదని పుతిన్ కొట్టిపారేశారు. రష్యా నుంచి ఓ వైపు అమెరికా దండిగానే న్యూక్లియర్ ఫ్యూయల్‌నుతమ దేశ అణు ఇంధన కేంద్రాల కోసం కొనుగోలుచేసుకొంటోంది. మరి భారత్‌ను ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. రష్యా యురేనియం ఇప్పుడు అమెరికా రియాక్టర్లకు అందుతోందని చెప్పారు. అమెరికాకు ఓ ధర్మం భారత్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. భారత్‌ను వద్దంటున్న ట్రంప్ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమే. ఇందుకు తాము అవసరం అయితే ట్రంప్‌తో కూడా చర్చించేందుకు సిద్ధం అని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని నిజంగానే ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన శాంతి స్థాపకులు అని అనుకోవచ్చు, అయితే ఈ విషయంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు ఉన్నాయని అన్నారు. శాంతి స్థాపనకే అలాస్క భేటీ సాగిందని తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి, ఇతర దేశాలతో సంబంధాలకు ముప్పు కల్గించేవి కావని పుతిన్ తెలిపారు. ఇవి ఇతరులకు వ్యతిరేకం అని అనుకోరాదని స్పష్టం చేశారు.
ప్రతి విషయంలోనూ ట్రంప్ సొంత అజెండాతో ఉంటారని అయితే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా సంబంధాలు మల్చుకోవడమే తమ అజెండా అని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణను ఆకాంక్షిస్తున్నామని చెప్పిన పుతిన్, నాటో అత్యంత ప్రమాదకరం అన్నారు. నాటో పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరి పాటించడం ఆ దేశానికే మంచిదన్నారు. ఇక అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుతూ యూరప్ తిరోగమన దశలో ఉంది. భారత్ పురోగమిస్తోంది. జి 7కు ప్రాధాన్యత లేదన్నారు. ఇండియా ముందంజలో ఉండటమే అమెరికా కలవరానికి కారణం అని ఆయన విశ్లేషించారు. బ్రిక్స్ కరెన్సీ ఇప్పట్లో వచ్చే వీలులేదని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారత్ వెలుగు అద్బుతం అని, ఇది ఎవరికి అంతుచిక్కని వాస్తవం అన్నారు.