రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, మార్చి13తో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 16 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఈసారి సిబిఎస్‌ఇ తరహాలో ఒక్కో పరీక్షకు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా అధికారులు పరీక్షల షెడ్యూల్ రూపొందించారు.