హైదరాబాద్: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బిఆర్ఎస్ బృందం నిజనిర్థారణ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ లోని షాపూర్లో హమాలీలతో కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని కోరారు. రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని, ఆషాడం సేల్ వంటి ఆఫర్ ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ అని ఢిల్లీకి మూటలు పంపేందుకు.. దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని కెటిఆర్ ప్రశ్నించారు.