పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయి తర్వాత శవమై కనిపించింది. తర్వాత కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల నౌల్తా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్‌రూమ్‌లో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్‌లో పడి చనిపోయినట్లు గుర్తించారు. దీనిని సహజ మరణంగా భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు..తర్వాత సిసిఫుటేజీ పరిశీలించగా.. మేనత్త పూనమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూనమ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు చెప్పింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు వెళ్లిన తర్వాత, నింధితురాలు బాలికను మేడమీదకు తీసుకెళ్లి, నీటిలో ముంచి చంపి.. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నీటి టబ్ లో పడి మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసి.. కిందకు తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు, మరో ఇద్దరు బాలికలను కూడా హత్య చేసిందని.. ఇందులో ఓ చిన్నారిని చంపుతుంటే చూసిన తన సొంత కొడుకును కూడా హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. కేవలం తనకంటే అందంగా ఉన్నారనే కారణంగా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నింధితురాలు వెల్లడించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.