మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్: త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రూ.262 కోట్లతో వివిధ అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రజా ప్రభు త్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. హుస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చె ప్పారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు.
గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌ డ్ నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపన కు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అండగా ని లిచిన తీరు, సోనియా గాంధీ ఇచ్చిన మాట, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని డిసెంబర్ 3న తెలంగాణ కో సం శ్రీకాంతా చారి బలిదానం చేసుకున్న ఘ టనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీ కాంతాచారి ఆశయ సాధనలో భాగంగా ప్రభు త్వం ఏర్పడిన ఏడాదిలోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెం డేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు
తెలిపారు. మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. పదేండ్ల దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చామని అన్నారు. డిసెంబర్ 3 తేదీకి ఒక ప్రత్యేకత ఉందాన్నారు. ఈ రోజే ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వం గెలుపొందిందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందన్నారు. నాడు కాంగ్రెస్ పాలకులు కట్టించిన ప్రాజెక్టులు నేటి వరకు చెక్కుచెదరకుండా సాగు, తాగు నీరు అందిస్తున్నాయని అన్నారు. గడీల పాలన, దొరల పెత్తనానికి హుస్నాబాద్ గడ్డ అంతం చేసి ఈ ప్రాంతానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ నేతృత్వంలో బహుజన రాజ్యపాలన వచ్చిందాన్నారు.
హుస్నాబాద్ తనకు సెంటిమెంటు అని చెప్పుకునే కెసిఆర్ హుస్నాబాద్ అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. హుస్నాబాద్‌కు ఆనుకొని ఉన్న సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన విధంగా హుస్నాబాద్ అభివృద్ధి ఎందుకు కాలేదని ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మాణాలు పూర్తయ్యాయని, హుస్నాబాద్ ప్రాంతంలో ఉండే గౌరవేల్లి, గండేపల్లి ఇంక ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ఎన్ని నిధులైన ఇచ్చి పూర్తి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 వేల కోట్లతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి రుణ విముక్తి చేశామన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ సర్కార్ ముఖ్య లక్ష్యమన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ అందించామన్నారు. వచ్చే పదండ్ల నాటికి 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి మెలిసి పోయి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఉండే వారికి గెలిపిస్తే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. కిరికిరి గాళ్లను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మంచోళ్ళని గెలిపిస్తే గ్రామాలకు అభివృద్ధికి నిధులు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. అదానీ,అంబానీలకు దీటుగా తెలంగాణ మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులకు ఓనర్‌లుగా మార్చామన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు,పేదలకు సన్న బియ్యం లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. వచ్చే పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిధుల కోసం ఢిల్లోకి వెళ్తున్నామని అన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి తన వంతు పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ ప్రజా విజయోత్సవాల్లో మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరామణారావు, సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు, సిరిసిల్ల రాజయ్య, వెంకట్రామిరెడ్డి, తుంకుంట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.