హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. దేశ, విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
అయితే, గ్లోబల్ సమ్మిట్‌కు సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. డిసెంబర్ 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనుంది. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షించేందుకు ఏర్పాటు చేయనుంది. ఈ సమ్మిట్ కు వెళ్లేందుకు ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని ఎంజిబిఎస్, జెబిఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బినగర్ నుండి ప్రత్యేక ఉచిత బస్సులను నడపనుంది.