ఎల్‌బి నగర్‌లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్‌కు తగిన వైద్యం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. బుధవారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి అడ్లూరి పరామర్శించారు. ప్రేమ చంద్ తల్లి దండ్రులు. తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, బాలుడికి స్పెషల్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించి చదువును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించినట్లు మంత్రి చెప్పారు.
బాధిత బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చేసుకుంటుందన్నారు. బాలుడికి అవసరమైన సహాయక చర్యలన్నీ ప్రభుత్వం నుంచి అందిస్తున్నామన్నారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారు. అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేస్తామన్నారు. కోలుకున్న తర్వాత బాలుడికి కావలసిన సంరక్షణకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైద్య చికిత్స, పునరావాస సహాయం అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ,ఆర్ ఎం ఓ డా ఆనంద్, లాలూ ప్రసాద్, బాబురావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.