కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా
మార్‌క్రమ్ శతకం, బ్రిట్జ్‌కే,బ్రెవిస్ అర్ధ సెంచరీలు
భారత్‌పై దక్షిణాఫ్రికా అద్భుత విజయం
రాయ్‌పూర్: భారత్‌తో బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 49.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ అసాధారణ ఆటతో చారిత్రక విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ చిరస్మరణీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మార్‌క్రమ్ 98 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన తెంబ బవుమా (46) తనవంతు సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన మాథ్యూ బ్రెట్జ్‌కె (68) పరుగులు సాధించాడు. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు అర్ధ సెంచరీ సాధించి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్థంగా నిర్వర్తించాడు. చెలరేగి ఆడిన బ్రెవిస్ 34 బంతుల్లోనే ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. టోనీ డి జోర్జి (17) పరుగులు చేసి రిటెర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కార్బిన్ బోస్చ్ 15 బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. భారత బౌలర్ల పేలవమైన బౌలింగ్‌కు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో భారీ స్కోరు సాధించినా భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు.
కోహ్లి, రుతురాజ్ శతకాలు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లిలు సెంచరీలతో ఆదుకున్నారు. కోహ్లి సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఇక చెలరేగి ఆడిన రుతురాజ్ 83 బంతుల్లోనే 12 బౌండరీలు, 2 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 43 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 358 పరుగులకు చేరింది.