గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి లోన్ పొందారని బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిఐడి అధికారుల దర్యాపు ఆధారంగా నిందితులు వుప్పుల దశరథ్ నేత, వుప్పుల లక్ష్మిబాయిలను దోషులుగా నిర్ధారిస్తూ ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ, 30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరిచింది. ఎర్రగడ్డలోని నేతాజీ నగర్‌కు చెందిన నిందితులు 2007లో ఎస్‌బిహెచ్, ఎయిర్ కార్గో బ్రాంచ్ నుండి రూ. 24,00,199- గృహ రుణాన్ని మోసపూరితంగా పొందారు. ఈ రుణం తీసుకునేందుకు నకిలీ పత్రాలను తనఖా పెట్టి జీడిమెట్లలో ఉన్న ఇంటికి రుణం పొందారు. నిందితులు ఆస్తి అసలు యజమానిగా నటించి, నకిలీ సంతకాలను చేసి,
అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఎ తప్పుడు పత్రాన్ని సృష్టించి, దానిని నమోదు చేసుకున్నారు. వ్యవస్థాగత అంతరాలను ఉపయోగించుకుని, ఈ జంట నకిలీ పత్రాలను ఉపయోగించి ఒకే ఆస్తిని బహుళ అమ్మకపు రిజిస్ట్రేషన్లను సృష్టించారు. ఈ పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కూకట్‌పల్లి బ్రాంచ్, కెనరా బ్యాంక్, కుందన్‌బాగ్ బ్రాంచ్‌లలో సైతం నిందితులు రుణాలు పొంది, చివరికి అన్ని రుణ చెల్లింపులను ఎగవేసారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని అప్పటి ఎస్‌బిహెచ్ ఏజిఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. నకిలీ అమ్మకపు ఒప్పందం, తనఖా పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు, చేతిరాత పోలిక నమూనాలు, బ్యాంకు రికార్డులు సహా 60 పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మోసం, మోసం చేయడానికి ఫోర్జరీ, నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం, నేరపూరిత కుట్ర ఉన్నాయని కోర్టు బావించి నిందితులకు జైలు శిక్ష విధించింది.