రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పోకడలు శ్రుతి మించుతున్నాయి. ఎంఎల్‌ఎ, ఎంపి పదవులకోసం అభ్యర్థులు ఎంతకైనా తెగించడం, కోట్లలో ఖర్చు చేయడం చూశాం. కానీ, ఒక గ్రామానికి మాత్రమే పరిమితమయ్యే సర్పంచ్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడట్లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్నది వట్టిమాట అని ఏనాడో నిరూపణ అయిపోయింది. పార్టీల అధినాయకులే వెనకుండి, అభ్యర్థులను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికలూ పార్టీలకు ‘ప్రతిష్ఠాత్మకం’గా మారుతున్నాయి. గెలిచేందుకు అడ్డదారులు తొక్కడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, చాటుమాటుగా కోట్లు ఖర్చు చేయడం, పోలింగ్ రోజున ఓటర్లను మందు, మనీతో ప్రలోభపెట్టడం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు మాత్రమే పరిమితమనుకునేవాళ్లు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల తీరును చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ అలవిమాలిన, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించాయి.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. రాజకీయాల్లో తమ అగ్రజులు హామీలు ఇవ్వగా లేనిది, తాము ఇస్తే తప్పేమిటనే ధోరణిలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు సైతం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్న చందాన అడ్డమైన హామీలు ఇచ్చి, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి 15 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికల తంతు ఎంత ప్రహసనంగా మారిందో అర్థమవుతుంది. ఆడబిడ్డ పుడితే రూ. 5వేల ఫిక్సెడ్ డిపాజిట్, ఆడపడుచు పెళ్లికి పుస్తెలు, మట్టెలు, అబ్బాయి వివాహానికి రూ. 5116 రూపాయలు ఇస్తాననీ సదరు అభ్యర్థి హామీల చిట్టా విప్పింది. అంతటితో ఆగకుండా, ఇల్లు కట్టుకునేవారికి పైకప్పు వేయించుకునేందుకు రూ.21 వేలు, శస్త్ర చికిత్స అవసరమైనవారికి రూ. 15 వేల సాయం, నెలకోసారి ఊళ్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తాననీ మాట ఇచ్చిందామె. తానిచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని తనకే అనిపించిందో ఏమో, ఓటర్లను నమ్మించేందుకు ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్‌పై హామీలు రాసి ఇచ్చింది. పంచాయతీలలో నిధులు ఉంటేనో లేక ప్రభుత్వం మంజూరు చేస్తేనో సర్పంచులు అభివృద్ధి పనులు చేయడం కద్దు. కానీ హరితహారం నర్సరీల నిర్వహణ, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల ఏర్పాటు వంటి పనుల అమలును చేపట్టవలసిందిగా సర్పంచులపై ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మరీ పనులు పూర్తి చేయిస్తున్నాయి.
నిధుల మంజూరు విషయానికొచ్చేసరికి మొహం చాటేస్తున్నాయి. సొంత డబ్బు వెచ్చించి పనులు పూర్తి చేసి, బిల్లుల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న సర్పంచులు ఇప్పటికీ కోకొల్లలుగా కనిపిస్తారు. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. గ్రామాలలో సర్పంచిగిరీ వెలగబెట్టేవారి వెనుక ఉండే ఇలాంటి విషాదగాథల గురించి తెలిసి కూడా ప్రస్తుత ఎన్నికల్లో పదవే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులను ఏమనాలి? ఏకగ్రీవాల పేరిట గ్రామాలలో జరుగుతున్న వేలం పాటల తీరు సైతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తోంది. గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ లేకుండా ఎవరో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంచుకోవడం స్వాగతించదగిన పరిణామమే. ఇందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. అయితే, అక్రమార్కులు ఈ ఏకగ్రీవాలను కూడా పరిహాసం చేస్తున్నారు. పోటీదారులను ప్రలోభపెట్టి, సర్పంచ్ పదవిని తన్నుకుపోయే గద్దల వల్ల గ్రామాభివృద్ధి జరగదు సరికదా, అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వేలంపాట నిర్వహించి, ఎవరు ఎక్కువగా పాడితే వారికే పదవి అప్పగించేందుకూ వెనుకాడటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఇలాంటి దొడ్డిదారి ఏకగ్రీవాల సంఖ్య ఊపందుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అసలే నిధుల లేమితో, పాలకుల నిర్లక్ష్యంతో నీరసిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకు గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఎన్నికలూ ప్రహసనంగా మారుతున్న నేపథ్యంలో గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యమయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనపించడం లేదంటే అతిశయోక్తి ఏముంటుంది?