ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశీయ విమాన ప్రయాణికులలో ఎక్కువమంది పర్యటించే ఇండిగో విమానాలు సిబ్బంది కొరత కారణంగా చాలా ఆలస్యంగా వడుస్తున్నాయి. ఫలితంగా రోజూ 2,200 పైగా విమానాలు నడిపే ఇండిగో మంగళ వారం నాడు 35శాతం కన్నా ఎక్కువ విమానాలను నడపలేక పోయింది . బుధవారంనాడు మధ్యాహ్నం వరకే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుతో సహా పలు విమానాశ్రయాలలో 200 పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే విమానం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో గగ్గోలు పెడుతున్నారు.
ఇండిగో విమానయాన సంస్థ గత కొద్ది రోజులుగా తీవ్రంగా పైలెట్ల కొరత ఎదుర్కొంటోంది. కొత్త విమాన డ్యూటీ సమయపరిమితి (ఎప్ డిటిఎల్) నిబంధనలు అమలు లోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు మరీ హెచ్చాయి. విమానాల ప్రయాణంలో జాప్యం వల్ల, విమానాల రద్దు వల్ల తీవ్ర సంక్షోభం ఎదురవుతోంది. కొన్ని విమానాలలో క్రూ సిబ్బంది కొరతవల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తున్నది. విమానయాన సంస్థ మరి కొన్ని ప్రాంతాలకు సిబ్బందిని తరలించాల్సివస్తోంది . ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి మరీ దిగజారింది. అలయన్స్ ఎయిర్ , స్పైస్ జెట్ తో పోలిస్తే.. 35 శాతం కన్నా విమానాలను నడపలేకపోతోంది. ఫలితంగా విమానాలు 7-8 గంటల పాటు ఆలస్యం అవుతున్నాయని విమానయాన సంస్థ పేర్కొంది.