రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కుగా ఉండాలి. అయితే దీన్ని సాకారంగా అమలు చేయడంలో మన సమాజం ఇంకా అనేక వర్గాలకు ముఖ్యంగా వికలాంగులకు పూర్తి న్యాయం చేయలేకపోయింది. ఎన్నికల సమయంలో వికలాంగుల ఓట్ల కోసం తాపత్రయపడతారు. కానీ వారి సమస్యలపై వారే స్వరం వినిపించుకునే స్థాయిలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో పాతినిధ్యం మాత్రం లభించడంలేదు. ఆల్ ఇండియా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో 2024లో చత్తీస్‌గఢ్ మాదిరిగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం అని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలుకు అంగీకారం తెలియజేస్తే తెలంగాణలో సుమారు 25 వేలకు పైగా వికలాంగులకు రాజకీయ అవకాశాలు లభిస్తాయి. ఇందులో సగం ప్రాతినిధ్యం వికలాంగ మహిళలకే దక్కుతుంది. తెలంగాణలో సుమారు 10 లక్షల మంది వికలాంగులు నివసిస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఇది 50 లక్షలకు పైగా ఓటర్ల ప్రభావం కలిగిన వర్గం. కానీ రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వీరికి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. చాలా మంది వికలాంగులు చదువుకున్నవారు, నైపుణ్యం, సామర్థ్యం ఉండి ప్రజాప్రతినిధులుగా పని చేయగలిగినవారు ఉన్నారు.
కానీ చట్టపరమైన అవకాశాలు లేనందున వికలాంగులు ప్రాతినిధ్యానికి దూరంగా ఉండవలసి వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాలద్వారా వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నది. కానీ నిజమైన చేయూత అనేది రాజకీయ ప్రాతినిధ్యంలోనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా వికలాంగులు తమ జీవితాలపై ప్రభావంచూపే నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండలేకపోతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ఒక రాజ్యాంగ హక్కు మాత్రమే కాక, ఒక నైతిక బాధ్యత కూడా. ఇది గౌరవం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి దారితీసే కీలక మార్గం. తెలంగాణలో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఎక్కడా వికలాంగులకు నామినేట్ లేదా రిజర్వేషన్ ప్రాతినిధ్యం లేదు. 2016 నుంచి అమలులో ఉన్న వికలాంగుల హక్కుల చట్టం Rights of Persons with Disabilities ACT (2016) ప్రకారం పాలన, రాజకీయ ప్రాతినిధ్యంలో వికలాంగులకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తుంది. కానీ రాష్ట్రంలోని చట్టాలు ఇంకా దీనికి అనుగుణంగా సవరణ పొందలేదు. వికలాంగులు ఎన్నికలలో పోటీ చేయలేక, చట్టసభలలో నామినేట్ చేయబడక వారిపై తీసుకునే విధానాల్లో పాల్గొనలేక అణచివేతకు గురవుతున్నారు. 2019లో చత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట సవరణలు చేసి, ప్రతి పంచాయతీలో ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను నామినేట్ చేసే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వికలాంగుల రాజకీయ ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించిన తొలి చలనం. తరువాత రాజస్థాన్ రాష్ట్రం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. 2021లో స్థానిక సంస్థల్లో వికలాంగుల నామినేషన్ ద్వారా పాలనా ప్రమేయం కల్పించింది. ఏప్రిల్ 2025 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి వికలాంగులకు అన్నిస్థాయిలలో నామినేట్ చేయడం ప్రారంభించింది. వికలాంగులకు స్థానికి సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రతినిధులుగా ఎంపికైన వికలాంగులు స్థానిక సమస్యలపై నేరుగా మాట్లాడగలుగుతారు. ప్రభుత్వ ప్రణాళికల్లో వికలాంగుల అవసరాలకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. సామాజికంగా వారిపై ఉన్న అనవసర దృష్టి కోణాలు తొలగిపోతాయి. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం కాదు. ఒకసారి నామినేషన్ చట్టం అమలు చేస్తే అది ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక పెద్ద పునాది రాయవుతుంది. చత్తీస్‌గఢ్ మాదిరిగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేసి గెజిట్ ద్వారా ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను ప్రతీ పంచాయతీ స్థాయిలో నామినేట్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
ఈ ప్రక్రియకు RPWD Act, 2016 (Rights of Persons with Disabilities Act) ద్వారా చట్టపరమైన గౌరవం కూడా ఉంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243 డి, 243టి ప్రకారం స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు రిజర్వేషన్ కల్పించినందున తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలలో అవసరమైన సవరణలు తీసుకురావాలి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల పంచాయితీరాజ్ చట్ట సవరణలు పరిశీలించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించే చారిత్రక అవకాశంగా నిలుస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ రోజుల్లో సమాజంలో ప్రాధాన్యత కలిగినవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మకమైన, సమానత్వాన్ని ప్రతిబింబించే నిర్ణయం తీసుకునే గొప్ప అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది.
వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ఈ చర్య రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా ఉండదు. కానీ ఇది సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య మార్గంలో ఒక గొప్ప అడుగు. స్థానికంగా వికలాంగుల స్వరం వినిపించాలంటే వారికి అధికార భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఇది సమసమాజ నిర్మాణానికి అవసరమైన మానవ హక్కుల దిశగా ముందడుగు. చట్టపరంగా అవసరమైన సవరణలు చేసి గెజిట్ నోటిఫికేషన్‌ద్వారా వికలాంగులను స్థానిక సంస్థల్లో నామినేట్ చేసే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తీసుకుని పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలు చేస్తే అది రాజకీయంగా వికలాంగుల చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుంది. ఇది నిజమైన ప్రాతినిధ్యం కల్పించే చరిత్రాత్మక అవకాశం. ఇది కేవలం హక్కుల కోసం పోరాటం కాదు. ఇది సామాజిక న్యాయానికి అంకితమైన ఉద్యమం.
దైనంపల్లి మల్లికార్జున్
94903 00985