హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుండి మేల్కొనే వరకు బిజెపి గెలుస్తూనే ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రాంతీయల పార్టీలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు మాజీ సిఎం కెసిఆర్ ప్రయత్నించారని తెలియజేశారు. బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు. దేశానికి ఏం అవసరం అవుతుందో చెప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తమరు అడిగినట్టు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణను దేశంలో ఎలా అయితే అగ్రగామిగా తీర్చిదిద్దామో, దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పేవాడిని అని కెటిఆర్ పేర్కొన్నారు.