హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.