పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును లోక్ సభ బుధవారం నాడు ఆమోదించింది. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు, 2025 ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జిఎస్టీ పరిహార సెస్ నిలిచి పోయిన తర్వాత పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రేటు పెంచేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత సిగిరెట్లు, సిగార్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు, హుక్కా జర్దా, సువాసన గల పొగాకు వంచి అన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం అమలవుతుంది.ప్రస్తుతం పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీ తో పాటు వివిధ రేట్ల సెస్ విధించబడుతోంది. ప్రతిపాదించిన బిల్లులో నాటు పొగాకుపై 60-70 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగార్ల పై 25 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగరెట్ల పొడవు సైజ్, ఫిల్టర్ ఆధారంగా 1,000 స్టిక్స్ కు రూ. 2,700 నుంచి 11,000 వరకూ పన్ను విధించాలని ప్రతిపాదించారు. అయితే నమిలే పొగాకుపై కిలోకు రూ. 100 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం నాల్గో షెడ్యూల్ లోని సెక్షన్ 4 లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల టారిఫ్ రేట్ల స్థానంలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు.