మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ సమీప చేలల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. పశువులు, గొర్రెల కాపరులు తదుపరి సమాచారమిచ్చే వరకు అడవిలోకి వెళ్లరాదన్నారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంట పొలాల చుట్టూ కరెంట్ కంచెలు, ఉచ్చులు వేయరాదని సూచించారు.