వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ పైచేయి సాధించింది. బుధవారం రెండో రోజు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మాట్ హెన్రీ, జాకబ్ డఫి, జకారి ఫోల్క్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో విండీస్ 167 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆతిథ్య టీమ్ బౌలర్లలో డఫి ఐదు వికెట్లను తీయగా, హెన్రీ మూడు, ఫోల్క్ రెండు వికెట్లను పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ చందర్‌పాల్ (52), షాయ్ హోప్ (56) మాత్రమే రాణించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. దీంతో కివీస్ ఆధిక్యం 96 పరుగులకు చేరింది.