న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని రామ్జాస్ కళాశాల, దేశబంధు కళాశాలలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాంబు స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. కాగా, ఢిల్లీలో తరచుగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళనలకు గురిచేస్తోంది.
ఇక, మంగళవారం కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తర్వాత దర్యాప్తు చేసిన అధికారులు అది ఫేక్ బాంబు బెదిరింపుగా గుర్తించారు.