కోల్‌కతా: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌కు ప్రాతినిథ్యం వహించిన 14 ఏళ్ల సూర్యవంశీ 61 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నయా రికార్డును నెలకొల్పాడు. వైభవ్ 14 ఏళ్ల 250 రోజుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. విజయ్ 18 ఏళ్ల 118 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. కాగా, బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.